Skip to main content

యాత్ర లక్ష్యం

మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం - మన దేవాలయలను మనమే నిర్వహించుకుందాం - మన సమాజాన్ని మనమే సేవించుకుందాం.

  • లక్ష దేవాలయాలకు లక్ష ట్రస్టుల నిర్మాణం ప్రతి ట్రస్టులో కనీసం 10 మంది క్రియాశీల కార్యకర్తలు (ప్రతి దేవాలయ పరిధిలో 18 నుండి 30 సంవత్సరాల వరకు వయసు గల యువతి యువకులు దేవాలయ ట్రస్టులో సభ్యులు అవుతారు) 

  • 10 లక్షల మంది క్రియాశీల కార్యకర్తల నిర్మాణం దేవాలయం కేంద్రంగా ప్రతి గ్రామంలో బస్తీలో కనీసం ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించేటట్లు చేయడం.

యువతకు పిలుపు:

ఈ పాదయాత్రలో యువతి యువకులు కలిసి రావాలని పిలుపునిస్తున్నాము. కనీసము ఒక్కరోజు సమయం వెచ్చించి పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాము. పాదయాత్రలో అడుగడుగునా భారతదేశము మాతృభూమి భావన, ఈ సమాజము నాది అన్న భావన, ఇటు దేశభక్తి అటు దైవభక్తి మిళితమై ఒక అనుభూతితో, ఆనందముతో, భక్తి భావనతో దేశ, ధర్మ రక్షణ కొరకు సంకల్పం చేసుకుంటూ అటువంటి జీవితము కలిగి ఉంటానని సంకల్పిస్తూ అందరూ సమిష్టిగా ఉద్యమ స్ఫూర్తితో కదలి కలసి రావాలని పిలుపునిస్తున్నాము. 

నేడు భారతదేశంలో ఒక సంధి కాలములో ఉన్నది. హిందూ చైతన్యము వెల్లివిరుస్తూ ఉన్నది. ఆ చైతన్యాన్ని కార్యోన్ముఖంచేస్తూ, ఆచరణాత్మకంచేస్తూ, బాధ్యతలను స్వీకరిస్తూ మన దేవాలయాలను, మన గోసంపదను, మన జీవన మూలాలను, మన సామాజిక సమరసత మూల్యాలను గుర్తించి సంరక్షించుకుంటూ శాశ్వత కుటుంబ సమాజ జీవనాన్ని పదిలం చేసుకుంటూ ముందుకు సాగే పాదయాత్రలో మీరందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం.

కనుక త్యాగభావనతో నిస్వార్థ బుద్ధితో తను మన ధన పూర్వకముగా వచ్చి బాధ్యతగా ఈ పాదయాత్రలో పాల్గొనవలసిందిగా యువతీ యువకులకు, అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి, దైవభక్తి, దేశభక్తి ఉన్నవారికి, సమాజం పట్ల అవగాహన ఉన్నవారికి, అన్ని రంగాల వారికి వచ్చి పాదయాత్రలో పాల్గొనమని, భగవతి భారతి పూజయే ఈ పాదయాత్ర అని, అందరూ పూజారులే అని, చెబుతూ అందరిని ఆహ్వానిస్తున్నాం. 

ప్రత్యేకించి ఆదర్శవంతమైన దేవాలయ వ్యవస్థకు ధర్మకర్తలు, అర్చకుడు ప్రధానమైనటువంటి మూలస్తంభాలు. అందువలన వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. సమాజంలో నిరంతరము చైతన్యము జాగృతి చేస్తూనే ఉండాలి, నిరంతరము అందుకే పాటుపడుతూనే ఉండాలి అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని ఉత్సాహంగా దేశభక్తి ప్రభూతులై అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం.

మాటిమాటికి మళ్ళీ మళ్ళీ నిరంతరం సమాజంలో కలివిడిగా తిరుగుతూ సమాజాన్ని తట్టిలేపే కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉండాలి. మన హిందూ సమాజంలో ప్రాచీన కాలం నుండి ఎంతోమంది యతీశ్వరులు, సాధుసంతులు, భక్తిపరులు, సద్గురువులు నిరంతరం ధర్మ ప్రచారం చేస్తూ కీర్తనలు తత్వాలు పాడుకుంటూ సమాజంలో ఆధ్యాత్మిక ధార్మిక నైతిక సామాజిక విలువలను పెంపొందింప చేస్తూ అందరిచే ఆచరింప చేసే ప్రయత్నం నిరంతరము చేస్తూ వస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వము ఎంతోమంది కాషాయాంబరధారులు, పీఠాధిపతులు, మఠాధిపతులు సమాజాన్ని తట్టిలేపటంలో చైతన్యపరుచుటలో ముందు ఉన్నారు. స్వాతంత్ర్యానంతరం ధర్మ ప్రచారము కొంత కుంటుపడిన మాట వాస్తవం. అనేకమంది సాధు మహాత్ములు ధర్మపరులు వారి ప్రయత్నం వారు నిరంతరంగా చేశారు. సమాజంలో వస్తున్న సామజిక, సాంస్కృతిక మార్పులను దృష్టిలోపెట్టుకుని సువ్యవస్థిత, దేవాలయాకేంద్రిత ధార్మిక వ్యవస్థలను ఏర్పాటు చేవలసిన అవసరం ఉన్నదనేది వాస్తవం. అయితే గత 30 సంవత్సరాలుగా అంటే అయోధ్య ఉద్యమం నాటి నుండి దేశం మొత్తం మీద హిందుత్వం పట్ల అవగాహన ఆచరణ పట్టుదల పెరగటం మనం గమనిస్తున్నాం. అయితే ఈ తరుణంలో సమాజంలో చాలా వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలముగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మరల గ్రామ గ్రామాన తిరుగుతూ నేరుగా హిందూ సమాజాన్ని ఎక్కడికక్కడ కలుస్తూ మన భక్తి మార్గాన్ని తెలియజేస్తూ, భక్తిమాధ్యమంగా సమాజాన్ని కలుపుతూ, కలిసిన సమాజం శక్తివంతంగా తయారై ధర్మ పరిరక్షణ చేసుకునే విధంగా మలుచుకోవటమే నేటి మన కర్తవ్యం.