హిందూ దేవాలయ యువచైతన్య మహాపాదయాత్ర
శ్రీ భువనేశ్వరీ పీఠాధీశ్వరులు, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ కమలానందభారతీ స్వామివారు "భగవద్భక్తి - కర్తవ్య దీక్ష - సమాజ శక్తి" అనే నినాదంతో సనాతన హైదవ ధర్మ పరిరక్షణ, దేవాలయాల, సంస్కృతాంధ్ర భాషా పరిరక్షణ కొరకు, హిందూ యువ చైతన్యం కోసం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆషాఢ బహుళ విదియ, శనివారం 12 జూలై 2025 నుండి తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్దేశ్వర మహా శివాలయం నుంచి మరో మహా పాదయాత్రను ప్రారంభించారు.
హిందూ ధర్మానికి దేవాలయాలు, మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు ఆయువుపట్టు. తరతరాలుగా హైందవ సమాజానికి, ఆధ్యాత్మికతకు, సంస్కృతికి, సభ్యతకు, ధార్మిక, ఆచార సాంప్రదాయాలకు ఆలంబనగా, శక్తి కేంద్రాలుగా దేవాలయాలు నిలిచాయి. కాలక్రమంలో దేవాలయ కేంద్రిత వ్యవస్థ, అవగాహన, నిర్వహణలలో మార్పులు రావడం ద్వారా వాటి విపరీత ప్రభావాలు సమాజంలో ప్రతిబింబిస్తున్నాయి. కావున, వీటన్నిటి పరిష్కార దిశగా, సుమారు రెండు సంవత్సరాలు పాటు సాగే ఈ మహా పాదయాత్రలో, శ్రీశ్రీశ్రీ కమలానందభారతీ స్వామివారు తమ ప్రేమామృత పాదపద్మాలతో నడకదారిలో గ్రామ గ్రామాన్ని దర్శిస్తూ యావత్ హిందూ సమాజ వాస్తవ స్థితిగతులను ప్రత్యక్షంగా అనుభూతి చెంది భావితరాల భవిత కొరకు పల్లె, పల్లెలో ప్రతిహృదయాన్ని కదిలిస్తూ వారిలో ధార్మిక దీక్షను, దేవాలయ దివ్యత్వాన్ని, కౌటుంబిక కర్తవ్యాన్ని, మాతృభాష మాధుర్యాన్ని, పరివారిక పరంపరలను, పర్యావరణ పరిరక్షణలను గుర్తుచేస్తూ అంతరాలు లేని సమాజమే లక్ష్యంగా, ప్రముఖంగా హైందవ యువతలో ధార్మిక చైతన్యాన్ని నింపుతూ, క్రియాశీల సామజిక నేతృత్వ ఆవశ్యకతను, కర్తవ్యాన్ని ప్రభోదిస్తున్నారు.


