Skip to main content

భారతదేశమే ఒక దేవాలయం - ప్రతి దేవాలయం ఒక భారతదేశం

జ్ఞానము, సంస్కృతి, నాగరికతలనే ప్రాణాలను తనయందు ప్రతిష్టించుకొని భారతమాత ఓ దేవతగా, భారతదేశం సమస్త భూమండలంపై ఓ పవిత్ర దేవాలయంగా విలసిల్లుతోంది. భారతదేశమనే దేవాలయాన్ని పటిష్టంగా పరిరక్షించినంత కాలం అవనీతలమంతా శాంతి సామరస్యాలతో సుభిక్షంగా మనగలుగుతుంది. 

అలాగే సాక్షాత్తు భగవంతునికే జన్మనిచ్చిన తల్లి భారతావని అంతటా నిర్ణితములైన స్వయంభు, పురాణ ప్రాశస్త్య, చరిత్ర ప్రస్తావిత, తీర్థక్షేత్రములన్నీ, దేవాలయములన్నీ నిత్య దీప ధూప నైవేద్యాలతో, సూర్యోదయాత్పూర్వ వేదఘోషతో, గుడిగంటల శబ్దాలతో, నాదస్వరాలతో, కూచిపూడి, భరతనాట్యాది మువ్వల సవ్వడితో, సకల శాస్త్ర వికాస, విస్తారాలతో, జానపద కళల జాగృతితో సమాజం ఎప్పుడూ నిత్ చైతన్యమవుతూ ఉండాలి. అలా ఉన్నంతవరకు విశ్వగురు పీఠంపై భరతమాత విశ్వానికి జ్ఞాన కిరణాలను విరజిమ్ముతూ ఉంటుంది. అందుకే మనమంతా దేశమంతటా 6లక్షల 40వేల గ్రామాలలో ఉన్న ప్రతి దేవాలయాన్ని పరిరక్షించుకొంటూ, క్రియాశీలంగా ఉంచుకోవాలి.

ఈ సంకల్పంతోనే పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామిజీ మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం, మన దేవాలయాలను మనమే నిర్వహించుకుందాం, మన సమాజాన్ని మనమే సేవించుకుందాం అని సందేశంతో ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 2007 నుండి 2010 వరకు మూడు మహాపాదయాత్రలు, 2012 నుండి తిరిగి రథయాత్రలను నిర్వహించివున్నారు. ఇందులో భాగంగా దాదాపు 8,500 గ్రామాలలో 35వేలకు పైగా దేవాలయాలను సందర్శించారు.

మొదటి పాదయాత్ర: 

బాసర నుండి తిరుమల వరకు – 2007 సెప్టెంబర్ 16, ఋషి పంచమి నుండి 2008 జనవరి 26 వరకు 13 జిల్లాల్లో(అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు) 130 రోజుల పాటు, 3200 కి.మీ. మహా పాదయాత్ర చేసి తిరుపతిలో 10 వేల మందితో 'భక్తిసంగమం' నిర్వహించారు. 

రెండవ పాదయాత్ర: 

శ్రీకూర్మం (శ్రీకాకుళం) నుండి తిరుమల వరకు నాగపంచమి 6.8.2009 నుండి 16.2.2009 వరకు 11 జిల్లాలు (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు) – 200 రోజులు, 5500 కి.మీ. – 800 గ్రామాలు, దళిత బస్తీలు, గిరిజన బస్తీలు, మత్స్యకార గ్రామాలు సందర్శించి 2009 ఫిబ్రవరి 16న తిరుపతిలో 25 వేల మందితో 'మహా భక్తిసంగమం' నిర్వహించారు.

మూడవ మహా పాదయాత్ర: 

మహాభాగ్యనగర్ మహా పాదయాత్ర సంకల్పించి ఆశ్వయుజ శుద్ధ ద్వితీయ నుండి (20.9.2009) నుండి వసంత పంచమి (21.1.2010) వరకు 130 రోజులు, పాదయాత్ర నిర్వహించారు.

మొదటి రథ యాత్ర: 

2012లో ప్రారంభించి గ్రామ గ్రామాన రథయాత్ర చేస్తూ వేలాది గ్రామాలూ, దేవాలయాలు సందర్శిస్తూ, గిరిజన యానాదులు అర్చకులుగా ఉన్నటువంటి దేవునివెల్లంపల్లి గ్రామ శివాలయం, తిరుపతి జిల్లా నుండి ఆగస్టు2, 2017 శ్రావణ మాసం నుండి ప్రారంభించి సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన రథయాత్ర చేసారు.