Skip to main content

శ్రీ చిదానంద భారతి ​స్వామి

తదుపరి పీఠాధి పతులుగానున్న శ్రీ చిదానంద భారతీస్వామి వారు క్రోధన జ్యేష్ఠ (13-6-1985)న విజయవాడ దత్తాత్రేయా శ్రమములో తురీయాశ్రమము స్వీకరించి శ్రీ సత్యానంద భారతీ స్వాముల వారి వద్ద ప్రణవోపదేశము పొందిరి. వీరిని శ్రీ భువనేశ్వరీ పీఠమునకు ఉత్తరాధికారిగా నియమించిరి. అట్లు ఉత్తరాధికారిగా నిర్ణయింపబడిన శ్రీ చిదానంద భారతీ స్వామి వారిని పీఠాధిపతిగా క్షయ జ్యేష్ట, యందు (22-6-86) ధర్మకర్తలు పట్టాభిషేకము చేసిరి. వీరునూ గురువుగారి అడుగు జాడలలో నడచుచు పీఠ కార్యక్రమములను నిర్వహించినారు.


వీరు పూర్వాశ్రమమున శ్రీ సనాతన ధార్మిక సంఘమునకు చిరకాలము కార్యదర్శిగా నుండిరి. సాహిత్య శిరోమణి పట్టభద్రులై తర్క వేదాంత విశారద, బ్రహ్మ విద్యాలంకార బ్రహ్మశ్రీ ముదిగొండ వేంకట రామశాస్త్రి గారి వద్ద అద్వైత వేదాంత మభ్యసించి ప్రస్థాన త్రయశాంతి చేసిరి. శ్రీ బెల్లంకొండ రామరాయ కవీంద్రుల వారి కొన్ని రచనలను ఆంధ్రీకరించిరి. నరసరావుపేట ఓరియంటల్ కళాశాలలో సంస్కృతాధ్యాపకులుగా పనిచేసిరి. కొంత కాలము ప్రధానో పన్యాసకునిగా కూడ పనిచేసిరి. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండకము లనెడి ఐదు ఉపనిషత్తులను లలిత శైలిలో ఒక సంస్కృత కావ్యముగా రచించి "ఉపనిషత్కావ్యమని ప్రకటించిరి. 

వీరు తమ పీఠ నిర్వహణ కార్యక్రమ క్రమమునందు శ్రీసదానంద భారతీ స్వామి వారికి ఆశ్రమ దీక్షనిచ్చి ఆశ్రమమున కాహ్వానించినారు. విధి వైచిత్రము అనతి కాలమునందే సదానందులు పరమేశ్వరిలో ఐక్యము నొందిరి. వారు విజయవాడ కృష్ణా నది పుష్కర సమయమున నదీ గర్భమున దేహమును చాలించి ఈశ్వరైక్యమునకది గూడ యొక మార్గము అని చాటి చూపినారు. అటు తదుపరి చిదానంద భారతీ స్వామివారు తమ ఉత్తరాధికారి కొరకు అన్వేషించు చుండగా గర్తపురీ వాసులు, ఆంధ్ర భాషోపాధ్యాయులు, షోడశ కర్మ నిర్వాహకులు, విశేష మంత్రో పాసకులు అయిన శ్రీ సూర్యప్రకాశ రావు గారిని ఎన్నుకొని దీక్ష నోసగి ప్రకాశానంద భారతీ స్వామిగా దీక్షానాముము నొసంగి ఉత్తర పీఠాధిపతులుగా ప్రకటించిరి. ది : 23.03.2006న వారి 94 వ. సంవత్సరమున శ్రీ చిదానంద భారతీస్వామి వారు బ్రహ్మీ భూతులైనారు. వారి ఆదేశానుసారం గురువర్యుల సమాధి పార్శ్వభాగము నందే వారి పార్థివ శరీరము గూడ సమాధి గావింపబడినది.