శ్రీ సత్యానంద భారతి స్వామి
శ్రీ సత్యానంద భారతి స్వామి
పీఠ స్థాపకులు

శ్రీ చిదానంద సరస్వతీ స్వాములవారి నిర్యాణము జరిగిన పిదప ధర్మకర్తలు సమావేశమై ఈ యాశ్రమమున ఆచార్య పీఠమును నెలకొల్ప నిశ్చయించిరి. ఒక యతీశ్వరుని పీఠాధిపతిగా జేసి గురు పరంపర కొనసాగింప సంకల్పించిరి. అందులకై ఆచార్యునిగూర్చి అన్వేషించిరి. ఆ సమయమున శ్రీ సత్యానంద భారతీ స్వామివారు విజయవాడలో తురీయాశ్రమము స్వీకరించినట్లు తెలియ వచ్చెను. ధర్మకర్తలు వారిని సమీపించి తమ యాశ్రమములో పీఠాధి పత్యము వహింప బ్రార్ధించిరి. వారంగీకరింప 14-11-1978న వారిని శ్రీ భువనేశ్వరీ పీఠమునకు అధిపతిగా పట్టాభిషేకము చేసిరి.
వీరు పూర్వాశ్రమమున తెనాలి తాలూకా హైస్కూలులో చిర కాలము తెలుగు పండితులుగా బనిచేసియుండిరి. ప్రమాదీ ఆశ్వయుజ శు॥ దశమి - గురువారం 9.10. 1913 వీరు జన్మించిరి. వీరు ఉభయ భాషా ప్రవీణులు. కవి, పండితులు, మార్గదర్శకులు, మంచి రచయిత, విమర్శకులు-శ్రీవిద్యోపాసకులు, నిత్యాగ్ని హోత్రులు, సదాచారపరాయణులు. పెక్కు పాఠ్య గ్రంథ వ్యాఖ్యలను, ఉపవాచకములను రచించి ప్రఖ్యాతి గడించిన సుధీమణులు. ఆ కాలమున “పులిగడ్డ గైడ్స్” అంటే ఎగుర నెత్తుక పోయెడివారు. జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీస్వామి వారి ప్రియ శిష్యులైన శ్రీ వడ్లమూడి లక్ష్మీనారాయణగారివద్ద శ్రీ విద్యోప దేశమందిరి.
నిత్యము శ్రీ చక్రార్చన చేయుచు ఆచార్యునకు ప్రీతి పాత్రులై, క్రమముగా పూర్ణ దీక్షను పడసిన ధన్య జీవులు. శ్రీ విద్యను సాంగో పాంగముగ ధారణచేసిన యసాధారణ ప్రతిభాసమన్వితులు. కల్ప గ్రంధ నిరపేక్షముగా శ్రీ చక్ర రాజమునకు నవావరణార్చనము నిర్వహించిన ప్రజ్ఞానిధి.
వీరు శ్రీ సిద్ధేశ్వరీ (కుర్తాళం) పీఠమునకు ఉత్తరాధికారిగా నెన్నకొనబడిన ప.ప. శ్రీ విమలానంద భారతీ స్వామివారి వద్ద 12-10-1978న తురీయాశ్రమము స్వీకరించి ప్రణోవోపదేశము పొందిరి.
వీరు పీఠాధిపత్యము వహించిన వెంటనే ఆశ్రమమున శ్రీ చక్ర రాజమును ప్రతిష్టించిరి. పిమ్మట శ్రీ విమలానంద భారతీస్వామి వారు పంపిన శ్రీ భువనేశ్వరీ దేవి యొక్క శిలా విగ్రహమును శ్రీ చక్రాకృతితో నిర్మించిన మండపములో 7-10-1979న ప్రతిష్టించిరి. ఆ పీఠమునకు “శ్రీ భువనేశ్వరీ పీఠ”మని నామకరణమొనరించిరి.
తదాది శ్రీ భువనేశ్వరీ సహితముగా శ్రీ చక్ర రాజమునకు నిత్యార్చన - మధ్యాహ్న వేళలందు తీర్థ ప్రసాద వినియోగము, పూర్ణిమలందు సవావరణార్చనము మొదలైన పీఠ సంప్రదాయములు ప్రవేశ పెట్టబడినవి. భక్తుల కోర్కెననుసరించి పాద పూజలు - భిక్షావందనములు ఆచరణలోనికి వచ్చినవి. అనతి కాలముననే పీఠము రూపసౌందర్యమును సంతరించుకొనినది.
పిమ్మట రెండు మూడు సంవత్సరములలోనే ఆశ్రమమునకు ప్రాకారము, ఋతు రసాగ్ని (367) లింగాత్మక రుద్ర మండల ప్రతిష్ట, పంచముఖాంజనేయ ప్రతిష్ట, శ్రీ నాగేంద్రస్వామి ప్రతిష్టయు జరిగెను. మరియు ఆగ్నేయ భాగమున షోడశస్తంభ విలసితమైన శాశ్వత యాగ శాలయు నిర్మింపబడెను. ఈ యాశ్రమము వీరి హయాములో గొప్ప అభివృద్ధిని చూరగొనెను. దేవతార్చన కుసుమములకై ఒక పూదోట కూడ పెంచబడెను. రోజు రోజునకా పీఠ ప్రభావము పలువురికి విదితమైనది. శిష్యపరంపర ప్రారంభమైనది.
శ్రీ సత్యానంద భారతీ స్వాములవారు దేవతా విగ్రహ ప్రతిష్టా కలాపమును క్షుణ్ణముగా అవగాహన చేసికొనిన మేధాసంపన్నులు. దేవీ నవరాత్రములలో శ్రీ చక్ర రాజ నవావరణర్చనలు, శ్రీ భువనేశ్వరీదేవికి వివిధార్చనలు - సువాసిని - కుమారీ పూజలు - చండీయాగ నిర్వహణ పద్ధతిని ప్రవేశ పెట్టి పీఠమున కొక ప్రణాళికను రూపొందించిన మహనీయులు. పీఠ కార్యక్రమముతోబాటు భక్తుల గోత్ర నామములతో ఆర్జిత సేవలు పీఠమున నిర్వహింపబడుచున్నవి.
శ్రీ సత్యానంద భారతీ స్వామివారు క్షయ సం|| జ్యేష్ట శు॥ సప్తమి (14-6-86) నాడు బ్రహ్మైక్యము చెందిరి. పరమేశ్వరి దృష్టి కిరణ ప్రసరణ జరిగిన స్థానమునందు వారి పూర్వ ఆదేశానుసారం యాగశాల వెనుక భాగమున వీరి సమాధిని నిర్మించి తదుపరి లింగ ప్రతిష్ఠ గావించిరి.


